

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. ఈసారి శాసనసభతో పాటు శాసనమండలి సమావేశాలు కూడా ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. శాసనసభ సమావేశాలు ప్రధాన భవనంలో జరుగుతుండగా, శాసనమండలి సమావేశాలు పాత అసెంబ్లీ హాల్లో నిర్వహించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో అసెంబ్లీగా ఉపయోగించిన ఈ భవనం కొంతకాలంగా వినియోగంలో లేకుండా ఉండేది. తాజాగా కోట్లాది రూపాయల వ్యయంతో దీనిని పునరుద్ధరించి ఆధునిక వసతులతో మళ్లీ ప్రారంభించారు. ఈ భవనాన్ని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఇవాళ ఉదయం 11:27 నుంచి 11:37 గంటల మధ్య అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, మండలి చైర్మన్, స్పీకర్ కలిసి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉభయ సభల సభ్యులు అందరూ హాజరుకావాలని సూచించారు. ఉదయం 11:40 గంటలకు అసెంబ్లీ సంయుక్త సమావేశం ప్రారంభమవుతుండగా, 11:45 గంటలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇటీవల తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన మొదటిసారి అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!