

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సుదీర్ఘంగా విచారించింది. ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన విచారణ సుమారు 4 గంటల 50 నిమిషాల పాటు కొనసాగింది.
ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సిట్ బృందం కేసీఆర్‌ను ప్రశ్నించింది. విచారణ సమయంలో ఆయన తరపు న్యాయవాదికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఆదేశాల మేరకు జరిగింది, ఇంటెలిజెన్స్ అధికారులకు నేరుగా సూచనలు ఇచ్చారా, ప్రత్యేక పరికరాల కొనుగోలుకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి అనే అంశాలపై అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికే అరెస్టైన పోలీసు అధికారుల వాంగ్మూలాల్లో కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చిన అంశాలపై వివరణ కోరారు. అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సమయంలో ఫోన్ రికార్డింగ్‌లు ఎలా అందాయన్న విషయంపైనా సుదీర్ఘ విచారణ జరిగింది. సిట్ సేకరించిన వివరాలను కోర్టుకు నివేదిక రూపంలో సమర్పించనుండగా, తదుపరి దశలో మరికొందరు కీలక నేతలకు నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!