

భారత యువ గ్రాండ్‌మాస్టర్ డి. గుకేశ్ తన కెరీర్‌లోనే అత్యంత కఠినమైన పరీక్షకు సిద్ధమయ్యాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు ఉజ్బెకిస్థాన్‌కు చెందిన జవోఖిర్ సిందరోవ్‌తో తలపడనున్నాడు. మంగళవారం స్విట్జర్లాండ్ వేదికగా ప్రారంభమయ్యే ఈ పోరులో తొలి గేమ్‌ను గుకేశ్ నల్లపావులతో ఆడనున్నాడు. 2024 డిసెంబరులో చైనా ఆటగాడు డింగ్ లిరెన్‌ను ఓడించి, కేవలం 18 ఏళ్ల 6 నెలల వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి గుకేశ్ చరిత్ర సృష్టించాడు. అయితే ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. గత ఏడాది కాలంగా నిలకడలేని ఆటతీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో మాగ్నస్ కార్ల్‌సన్ సహా పలువురు ప్రముఖ చెస్ ఆటగాళ్లు సిందరోవ్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
గత ఏడాది టాటా స్టీల్ చెస్ మాస్టర్స్‌లో రన్నరప్‌గా నిలిచిన గుకేశ్.. నార్వే చెస్‌లో మూడో స్థానాన్ని సాధించాడు. అయితే 2025 చివరి నాటికి ఫామ్ కోల్పోయి ఫిడే ప్రపంచకప్‌తో పాటు ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లలోనూ నిరాశపరిచాడు. ఈ ఏడాది కూడా టాటా స్టీల్ చెస్ మాస్టర్స్, ప్రేగ్ అంతర్జాతీయ చెస్ ఫెస్టివల్, నార్వే చెస్ టోర్నీల్లో ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో దాదాపు 70 క్లాసికల్ రేటింగ్ పాయింట్లు కోల్పోయి 2710 పాయింట్లకు పడిపోయాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం నుంచి 26వ స్థానానికి దిగజారాడు. మరోవైపు క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచిన సిందరోవ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు. 2025 ఫిడే ప్రపంచకప్‌ను కూడా గెలుచుకున్న అతడు 2782 రేటింగ్ పాయింట్లతో ప్రపంచ నాలుగో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఈ ఛాంపియన్‌షిప్‌లో మొత్తం 14 క్లాసికల్ గేమ్‌లు ఉంటాయి. ముందుగా 7.5 పాయింట్లు సాధించిన ఆటగాడు విజేతగా నిలుస్తాడు. స్కోర్లు సమమైతే టైబ్రేక్ నిర్వహిస్తారు. ఈ పోటీకి సుమారు రూ.23 కోట్ల ప్రైజ్‌మనీని ప్రకటించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!