

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కలిసి పేదల ఓటు హక్కును తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఓట్ల తొలగింపుపై ప్రధాని సమాధానం చెప్పాలని, లేదంటే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గురువారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద నిర్వహించిన నిరసన దీక్షలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కులం, మతం, ప్రాంతం, భాష పేరుతో ప్రజలను విభజించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తమకు అనుకూలమైన ఓట్లను కొనసాగిస్తూ, వ్యతిరేకుల ఓట్లను తొలగిస్తున్నారన్నది ఆయన ప్రధాన ఆరోపణ.
దేశ జనాభా 140 కోట్లకు పైగా ఉన్నప్పటికీ ఓటర్ల సంఖ్య తగ్గడంపై ప్రధాని వివరణ ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు. 2014లో 81 కోట్ల మంది, 2019లో 91 కోట్ల మంది, 2024లో 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని పేర్కొంటూ, ప్రస్తుతం 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారని ఆరోపించారు. ఈ పరిణామాలపై ప్రజలు ఆందోళనకు దిగుతున్నారని, ఇది కాంగ్రెస్ లేదా ఇండియా కూటమికి మాత్రమే సంబంధించిన అంశం కాదని వ్యాఖ్యానించారు. ప్రజల ఓటు హక్కును పరిరక్షించేందుకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసిన ఆయన, గతంలో జయప్రకాశ్ నారాయణ్ చేపట్టిన సంపూర్ణ క్రాంతి ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, మోదీ తన పదవిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!