

డీలిమిటేషన్ బిల్లుపై బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడాన్ని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్రంగా తప్పుబట్టారు. సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ బిల్లుకు బీఆర్ఎస్ ఎందుకు మద్దతు ఇస్తోందని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపిస్తూ, ఆ డీల్ వివరాలను కేసీఆర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ప్రజలను మభ్యపెట్టే రాజకీయ నాటకమని ఆరోపించారు. కేసీఆర్, ప్రధాని మోదీ మధ్య హాట్‌లైన్ కొనసాగుతోందని కూడా విమర్శించారు.
డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యం తగ్గే ప్రమాదం ఉందని అద్దంకి దయాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి చర్చలు లేకుండానే బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ అంశంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచాలన్న ప్రతిపాదనకు సరైన ప్రాతిపదిక లేదని, దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాలకు అధిక రాజకీయ ప్రాధాన్యం లభించి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కూడా బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గతంలో పదేళ్ల పాటు కేంద్రం ప్రవేశపెట్టిన పలు బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తుచేస్తూ, ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనించాలని కోరారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ మాత్రమే పోరాడుతోందని పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!