

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు వరుస సర్‌ప్రైజ్‌లు అందుతున్నాయి. ఇప్పటికే ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మేళా’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇప్పుడు మోస్ట్ ప్రెస్టీజియస్ కాంబినేషన్ మూవీ ‘ఓమ్’ నుంచి ప్రత్యేక అప్‌డేట్ వచ్చింది. ఇందులో మమ్ముట్టి పోషిస్తున్న పవర్‌ఫుల్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘బుర్మా కార్తికేయన్’ అనే విభిన్నమైన పాత్రలో మమ్ముట్టి కనిపించి ఆకట్టుకున్నారు. గ్లింప్స్‌లో పోలీస్ స్టేషన్ ఖైదీల జాబితాలో కార్తికేయన్ ఫొటో కనిపిస్తుంది. పోలీసులు అతని కోసం గాలిస్తుంటే, ప్రజలు మాత్రం అతనికి మద్దతుగా నిలుస్తారు. మరోవైపు పోలీసులు కార్తికేయన్ ఎక్కడున్నాడని వెతుకుతుండగా, అతను పోలీస్ స్టేషన్‌లోనే కూర్చొని క్రికెట్ మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ కనిపించడం ఆసక్తికరంగా ఉంది.
గ్లింప్స్‌లో జైలు లోపల శత్రువులను చితకబాదడం, బెయిల్‌పై బయటకు వచ్చి తన అక్రమ సామ్రాజ్యాన్ని నడిపించడం వంటి యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. మమ్ముట్టి స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్ వీడియోకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇందులో మమ్ముట్టి ధనుష్ తండ్రి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో సాయి పల్లవి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వండర్‌బార్ ఫిలిమ్స్, ఆర్‌టేక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా, అక్టోబర్ 16న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!