

రాష్ట్రంలో వంటగ్యాస్ కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా యుద్ధ ప్రభావంతో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత పెరిగిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, “ఆంబోతుల కొట్లాటలో లేగదూడలు బలైనట్లు” ప్రజలు నష్టపోతున్నారని అన్నారు.
దేశవ్యాప్తంగా ఎల్పీజీ పంపిణీ కేంద్రాల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున క్యూల్లో నిలబడాల్సి వస్తోందని ఆయన తెలిపారు. గ్యాస్ కొరత లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని విమర్శించారు. పెట్రోలియం, గ్యాస్ వ్యవహారాలు కేంద్ర పరిధిలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో కొరత ఉందని పరిస్థితులు సూచిస్తున్నాయని అన్నారు. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత మే 4 నుంచి సిలిండర్ బరువును తగ్గించే యోచనలో కేంద్రం ఉందని, ప్రస్తుతం ఉన్న 12 కిలోల సిలిండర్‌ను 10 కిలోలకు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి మధ్య తరగతి ప్రజలపై భారం మోపుతున్నాయని ఆరోపించారు. గ్యాస్ దొరకడం కష్టంగా మారిందని, ప్రతి ఇంట్లో ఇదే సమస్య చర్చకు వస్తోందని పేర్కొన్నారు.
ఇరాన్లో సమస్యలు ఉన్నప్పటికీ, ఇతర దేశాల నుంచి గ్యాస్‌ను దిగుమతి చేసుకుని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతూ, శాసనసభ, శాసనమండలిలో వాయిదా తీర్మానం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను ప్రతినిధ్యం వహిస్తూ సభలో చర్చకు పట్టుబడతామని ఆయన స్పష్టం చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!