

రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉద్యోగాల కోసం పోరాడుతున్న నిరుద్యోగ విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయించిందని ఆయన ఆరోపించారు. లగచర్లలో భూముల కోసం పోరాడుతున్న గిరిజన మహిళలపై దాడులు జరిగాయని, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని విమర్శించారు. కంచ గచ్చిబౌలి ప్రాంతంలో వేలాది చెట్లను నరికివేయడం, వన్యప్రాణులు, జీవవైవిధ్యానికి నష్టం కలిగించడం, కేబీఆర్ పార్కు అంశాలపై కూడా రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, మహిళా ప్రజాప్రతినిధులపై దాడుల ఘటనలపైనా ఆయన నిలదీశారు.
రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, జర్నలిస్టుల అరెస్టులు, కార్పొరేట్ అనుకూల విధానాలు, భూకబ్జాలు, కాంగ్రెస్ నేతలపై వస్తున్న అవినీతి ఆరోపణలపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. గతంలో ఈ అంశాలపై మౌనంగా ఉన్న రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రచార పర్యటన కోసం హైదరాబాద్‌కు రావడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ పర్యటన కోసం తెలంగాణ ప్రజల సొమ్ము నుంచి రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ ఆరోపించిన కేటీఆర్, ఆ ఖర్చుకు ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!