

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దేశ సమగ్రత, రాష్ట్ర అభివృద్ధి కోసమే పని చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉండాలని, అరాచక శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా, వారి ముఖాల్లో సుఖసంతోషాలు నింపేందుకు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటానని ఆయన తెలిపారు.
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాలులో జనసేన పార్టీ నుంచి నామినేటెడ్ పదవులు పొందిన వారితో నిర్వహించిన ‘పదవి–బాధ్యత’ సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పదవులు పొందిన వారితో బాధ్యతాయుతంగా పనిచేస్తామని ప్రమాణం చేయించారు. పార్టీ కోసం మొదటి నుంచి క్షేత్రస్థాయిలో కష్టపడ్డ వారికే ప్రాధాన్యం ఇచ్చామని, ఎంపిక ప్రక్రియలో ఎలాంటి సిఫార్సులకు తావు ఇవ్వలేదని తెలిపారు. కూటమిలో భాగంగా ఇప్పటివరకు జనసేనకు రాష్ట్రవ్యాప్తంగా 3,459 నామినేటెడ్ పదవులు లభించాయని, మరికొన్ని త్వరలో భర్తీ కానున్నాయని వెల్లడించారు.
జనసేన పార్టీ ఆలోచన విధానం జాతీయ దృక్పథంతో కూడినదని పవన్ కళ్యాణ్ చెప్పారు. యువత గళానికి వేదికగా ఉండాలనే లక్ష్యంతో ఈ పార్టీని స్థాపించానని, జనసేన సిద్ధాంతాలు బలమైనవని స్పష్టం చేశారు. పార్టీకి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు అందరూ వ్యక్తిగతంగా కాదు, సమిష్టి భావజాలం, పోరాట శక్తి ఫలితమేనని అన్నారు. కుల రాజకీయాలకు తావులేకుండా, అన్ని వర్గాలను కలుపుకుని సమాజం కోసం పనిచేయడమే జనసేన లక్ష్యమని, భావితరాలకు ఉపయోగపడే ఏడు మూల సూత్రాలతో పార్టీ ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!