

జోగి రమేష్ ఇంటి వద్ద జరిగిన దాడి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. మైలవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులపై నమోదైన కేసుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కేసులు నమోదు చేసినట్టు అధికారులు సీఎంకు నివేదించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిందేనని స్పష్టం చేశారు. ఉద్రిక్తతలకు దారితీసే చర్యలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన తేల్చిచెప్పారు.
చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే, కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. పార్టీతో సంబంధం లేకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరికీ మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. అలాగే, పోలీసులు నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లోనవకుండా, ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రజల భద్రతే అత్యంత ప్రాధాన్యమని మరోసారి పునరుద్ఘాటించిన సీఎం, ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!