

రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామనే విషయాన్ని ప్రజల్లో స్పష్టంగా చాటేలా ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
ఈ కార్యాచరణలో భాగంగా ఈ నెల చివరలో లేదా వచ్చే నెల మొదటి వారంలో హైదరాబాద్లో జాతీయస్థాయి ఓబీసీ మహాసభను నిర్వహించాలని పార్టీ నేతలు యోచిస్తున్నారు. ఈ సభకు అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ ముఖ్య నేతలను ఆహ్వానించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈ వేదిక ద్వారా బీసీ రిజర్వేషన్ల పై పార్టీ వైఖరిని మరోసారి ప్రజలకు స్పష్టంగా వివరించాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది.
అలాగే బీసీ రిజర్వేషన్ల అమలుకు బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోందనే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగనున్న నేపథ్యంలో, పార్టీ తరఫున బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించి ప్రత్యర్థి పార్టీలకు రాజకీయ సవాల్ విసిరేలా వ్యూహం రచించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.
ఇక 2029 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే బీసీ రిజర్వేషన్లకు న్యాయం జరుగుతుందన్న అంశాన్ని ప్రజల్లో బలంగా ప్రచారం చేయాలని పార్టీ యోచిస్తోంది. ఇటీవల జరిగిన ఓబీసీ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
బీసీలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తోందని పేర్కొన్న ఆయన, టీపీసీసీ కార్యవర్గంలో 50 శాతం బీసీలకు ప్రాతినిధ్యం కల్పించామని తెలిపారు. అలాగే ఉపాధ్యక్షుల్లో 68 శాతం, జనరల్ సెక్రటరీల్లో 70 శాతం, డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో 17 జిల్లాల్లో బీసీలకు అవకాశం ఇచ్చినట్లు వెల్లడించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన బీసీ వర్గాల నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ భావిస్తోందని కూడా ఆయన స్పష్టం చేశారు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!