

జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. నాలుగేళ్ల వయసులోనే టైప్-1 డయాబెటిస్ బారిన పడిన జ్వెరెవ్‌ను క్రీడలకు దూరంగా ఉంచాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన తల్లి మాత్రం వెనుకడుగు వేయలేదు. తన కుమారుడు ఏ రంగంలో రాణించాలనుకుంటే ఆ రంగంలోనే ముందుకు సాగాలని ప్రోత్సహించారు. తల్లి అండతో జ్వెరెవ్ టెన్నిస్‌లో కొనసాగుతూ 2013లో ప్రొఫెషనల్‌గా మారారు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదిగారు.
తన అనుభవాన్ని ఇతర చిన్నారులకు ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశంతో జ్వెరెవ్ డయాబెటిస్‌పై అవగాహన కల్పించడంతో పాటు ‘అలెగ్జాండర్ జ్వెరెవ్ ఫౌండేషన్’ను స్థాపించారు. ఈ ఫౌండేషన్ మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులకు ఇన్సులిన్, మందులు అందించేందుకు సహాయం చేస్తోంది. 2022 ఫ్రెంచ్ ఓపెన్‌లో మోకాలి గాయంతో పాటు వ్యక్తిగత జీవితంలో ఎదురైన వివాదాలు కూడా ఆయన కెరీర్‌కు సవాళ్లు విసిరాయి. అయినప్పటికీ వాటిని అధిగమిస్తూ జ్వెరెవ్ తన ప్రయాణాన్ని కొనసాగించారు. తాజా గ్రాండ్‌స్లామ్ విజయాన్ని తన తల్లికి అంకితం చేస్తూ.. తన జీవితంలో ఆమె ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!