

మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో మరోసారి భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో 288 మున్సిపల్ కౌన్సిల్స్, నగర పంచాయతీలకు పోలింగ్ జరగగా, మహాయుతి కూటమి (బీజేపీ, శివసేన, ఎన్సీపీ) మొత్తం 207 స్థానిక సంస్థల అధ్యక్ష పదవులను గెలుచుకుంది. ఇది దాదాపు 70 శాతం విజయానికి సమానం.
ఇక మహావికాస్ అఘాడీ కూటమి (కాంగ్రెస్, శివసేన–UBT, ఎన్సీపీ–శరత్ పవార్) సమిష్టిగా పోటీ చేసినప్పటికీ 44 అధ్యక్ష స్థానాలకే పరిమితమైంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని నగర పంచాయతీలలో కూడా మహాయుతి తన ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది.
పోలింగ్ ఫలితాలను పరిశీలిస్తే, బీజేపీ ఒక్కదానికే 117 మున్సిపల్ అధ్యక్ష పదవులు దక్కాయి. శివసేన 53, ఎన్సీపీ 37 స్థానాలను గెలుచుకున్నాయి. మరోవైపు కాంగ్రెస్కు 28, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)కు 7, శివసేన (UBT) కు 9 స్థానాలు లభించాయి. ఎన్నికల సంఘంలో నమోదు అయిన ఇతర పార్టీలకు 4 స్థానాలు దక్కగా, గుర్తింపు లేని నమోదిత పార్టీలకు 23 స్థానాలు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థులు 5 అధ్యక్ష పదవులను కైవసం చేసుకున్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ స్థానిక సంస్థల ఫలితాలు ఒక రకంగా ‘సెమీ ఫైనల్’ లాంటివని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విజయం పై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర ప్రజలకు ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!