

తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాల కల్పన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌కు వచ్చిన సమయంలో రాహుల్ గాంధీ యువతతో ముచ్చటిస్తూ, ఇరానీ చాయ్ తాగుతూ అనేక హామీలు ఇచ్చారని కేటీఆర్ తన ఎక్స్ పోస్టులో గుర్తుచేశారు. అయితే, ఇప్పుడు ఆ హామీలన్నీ ఆచరణలో విఫలమయ్యాయని ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాల హామీ కట్టుకథగా మారిందని, యువ వికాసం ఎండమావిగా మిగిలిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ తెలంగాణ యువత నమ్మకాన్ని అపహాస్యం చేసిందని మండిపడ్డారు.
ఉద్యోగాల కల్పన అనేది ఫొటోషూట్లు, ప్రచార కార్యక్రమాలతో సాధ్యమయ్యేది కాదని.. దానికి దూరదృష్టి, నిబద్ధత అవసరమని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ యువతకు కాంగ్రెస్ నాయకత్వం ఏమీ చేయలేకపోయిందని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడిన యువత, మరోసారి పోరాటానికి సిద్ధమవుతారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు యువత ఉద్యమిస్తుందని అన్నారు. ఇది కేసీఆర్ గడ్డ అని, పోరాట యోధుల నేల అని పేర్కొంటూ.. నమ్మకద్రోహాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని కేటీఆర్ తన పోస్టులో వ్యాఖ్యానించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!