

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తీసుకొచ్చిన కొన్ని రాజ్యాంగ సవరణలపై విమర్శలు గుప్పించారు. తొలి రాజ్యాంగ సవరణ ప్రాథమిక స్వేచ్ఛలను పరిమితం చేసిందని ఆరోపించారు. అలాగే 42వ రాజ్యాంగ సవరణ న్యాయ సమీక్ష అధికారాలను కుదించిందని వ్యాఖ్యానించారు. అధికార దాహంతో, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించే నాయకత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవడానికి యువత 38వ, 39వ రాజ్యాంగ సవరణలను అధ్యయనం చేయాలని సూచించారు.
ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసేందుకు ఆర్టికల్ 356ను పదేపదే దుర్వినియోగం చేశారని ప్రధాని మోదీ విమర్శించారు. ఒక రాజకీయ పార్టీ ఈ అధికరణాన్ని దాదాపు 100 సార్లు ఉపయోగించి ప్రజల మద్దతుతో ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వాలను తొలగించిందని ఆరోపించారు. ఒక ప్రధానమంత్రి ఒక్కరే 50 సార్లకు పైగా ఆర్టికల్ 356ను వినియోగించారని ప్రస్తావించారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంస్థలు, దేశ సమాఖ్య వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!