

2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ అగౌరవపరుస్తున్నారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. పేరు, ప్రాధాన్యం లేని ఓ చిన్న వెబ్‌సైట్‌లో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకుని ప్రజాతీర్పును ప్రశ్నించడం సరికాదని మండిపడ్డారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో అమరావతిపై తప్పుడు ప్రచారం చేసిందని టీడీపీ ఆరోపించిన మయాంక్ అగర్వాల్ పనిచేస్తున్న సంస్థే ఇప్పుడు 2024 ఎన్నికలపై అసత్య కథనాలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. మయాంక్ అగర్వాల్ ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ సంస్థలో చేరి, మరో ఇద్దరితో కలిసి ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు, నివేదికలు రూపొందిస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వైసీపీ నాయకులు, గతంలో ఎందుకు న్యాయస్థానాలను ఆశ్రయించలేదని విజయ్ కుమార్ ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణపై అనుమానాలు ఉంటే పోలింగ్ సమయంలో, అనంతరం ఎన్నికల అధికారులు జారీ చేసిన ఫామ్ 17(సి) పార్ట్ 1, పార్ట్ 2లపై వైసీపీ ఏజెంట్లు ఎందుకు సంతకాలు చేశారని నిలదీశారు. ఎన్నికల ప్రక్రియపై నిజంగా అభ్యంతరాలు ఉంటే అప్పుడే వాటిని అధికారుల దృష్టికి లేదా న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లాల్సిందని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రశ్నించేలా ఇప్పుడు ఆరోపణలు చేయడం తగదని ఆయన విమర్శించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!