

మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సిట్ విచారణ ముగిసిన అనంతరం ఆయన నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీనియర్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను మూడు పదాల్లో వివరించాలంటే — డైవర్షన్, సబ్వర్షన్, పర్వర్షన్ అని వ్యాఖ్యానించారు. ప్రజల దృష్టిని మళ్లించడం, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం, వక్ర రాజకీయాలకు పాల్పడటమే కాంగ్రెస్ పాలన లక్షణమని విమర్శించారు.
సిట్ చట్టాన్ని, పార్లమెంట్ తీసుకొచ్చిన BNSS నిబంధనలను కూడా గౌరవించలేదని కేటీఆర్ ఆరోపించారు. అయినప్పటికీ ఒక బాధ్యతాయుతమైన పార్టీగా, రాజ్యాంగ విలువల పట్ల గౌరవంతో కేసీఆర్ పూర్తిస్థాయిలో విచారణకు సహకరించారని తెలిపారు. చట్టపరంగా ఆయన అక్కడికి రావాల్సిన అవసరం లేకపోయినా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, ప్రజాప్రతినిధిగా ప్రతి ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇచ్చారని అన్నారు. ఈ విచారణతో ఎలాంటి తప్పు జరగలేదన్న విషయం అధికారులకు స్పష్టమైందని పేర్కొన్నారు. మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, లీకుల పేరుతో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక ప్రకటనలు తప్ప మరేదీ విశ్వసించవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!