

పేద విద్యార్థుల చదువులకు మరోసారి ఆర్థిక సహాయం అందించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదవశాత్తూ తండ్రులను కోల్పోయిన ఎర్రవెల్లి గ్రామానికి చెందిన ఇద్దరు పేద విద్యార్థుల ఇంజనీరింగ్ చదువులకు ఆయన పూర్తి భరోసా ఇచ్చారు. ఇటీవల విద్యుత్ ప్రమాదంలో మరణించిన పేద రైతు చిన్రాజు సత్తయ్య కుమారుడు నవీన్, అలాగే కొన్ని సంవత్సరాల క్రితం ప్రమాదంలో మరణించిన మరో పేద రైతు పెద్దోళ్ల సాయిలు కుమారుడు అజయ్—ఇద్దరూ స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు.
ఈ ఇద్దరు విద్యార్థుల బీటెక్ పూర్తి కోర్సు ఫీజులను కేసీఆర్ గారు స్వయంగా చెల్లించారు. అంతేకాదు, వారి చదువుకు అవసరమైన పుస్తకాలు, కంప్యూటర్ల కోసం కూడా ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారికి విడివిడిగా చెక్కులు అందజేశారు. “కష్టపడి మంచిగా చదువుకోండి బిడ్డా. ఫీజుల కోసం భయపడొద్దు. ఏ సమస్య వచ్చినా నేనున్నా” అంటూ కేసీఆర్ గారు వారికి ధైర్యం చెప్పారు.
అదే సమయంలో, విద్యుత్ ప్రమాదంలో మరణించిన చిన్రాజు సత్తయ్య కుటుంబానికి చట్టప్రకారం విద్యుత్ శాఖ నుంచి అందాల్సిన ఆర్థిక సహాయం పూర్తిగా అందేలా పర్యవేక్షించాలని తన వ్యక్తిగత కార్యదర్శి నాగేందర్ రెడ్డిని కేసీఆర్ గారు ఆదేశించారు. కుటుంబ పెద్దను కోల్పోయిన తమను గుర్తించి, ఆదరించి, పిల్లల చదువు మరియు భవిష్యత్తు గురించి ఆలోచించినందుకు విద్యార్థుల తల్లులు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎర్రవెల్లి గ్రామానికి చెందిన పేద విద్యార్థులు తమ చదువుకు భరోసాగా నిలిచినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!