

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల నామినేషన్ పత్రాలను లాక్కున్నారంటూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఆరోపణలపై భాజపా ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి విమర్శలు గుప్పించారు. ఈ ఆరోపణలు జగన్ రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. దౌర్జన్యాలు, అరాచకాలతో కాకుండా అభివృద్ధి చేస్తేనే ప్రజలు ఆశీర్వదిస్తారని ఎన్నికల ఫలితాలు నిరూపించాయని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన భాజపా ప్రజాప్రతినిధులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భాజపా సాధించిన విజయం చిన్నదేమీ కాదని, క్షేత్రస్థాయిలో పార్టీకి పెరుగుతున్న బలానికి ఈ ఫలితాలు నిదర్శనమని చెప్పారు.
రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో భాజపా మరింత బలోపేతమై ప్రజల మద్దతు కూడగడుతుందని పురందేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గణనీయమైన సహకారం అందిస్తోందని, పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తోందని తెలిపారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లోనూ భాజపాను ఆదరించాలని ప్రజలను కోరారు. కూటమిలో క్షేత్రస్థాయిలో కొంత సమన్వయ లోపం ఉందని, ఇలాంటి సమస్యలు సహజమేనని అభిప్రాయపడ్డారు. ప్రజల మద్దతు ఉన్నప్పటికీ సమన్వయ లోపం కారణంగా కొన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఓటమి పాలయ్యారని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా భాగస్వామ్య పక్షాలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతాయని స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!