

తెలంగాణ రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనసభలో ఏ అంశంపైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ హాజరుకావాలని ఆయన కోరారు. సోమవారం హైదరాబాద్ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్షం సభకు వచ్చి ప్రశ్నలు అడిగితే ప్రతి అంశంపై సాక్ష్యాధారాలతో సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే ప్రజా సమస్యలను పక్కనబెట్టి ప్రతిపక్షం తమ సొంత ఎజెండాతో సభకు వస్తోందని విమర్శించారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల నిర్వాసితులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో న్యాయం చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, అర్హులందరికీ త్వరలోనే ఇంటి పట్టాలు మరియు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్ వద్ద క్రషర్ యూనిట్ తనదని చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, అది తనకు సంబంధించినది కాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు అసెంబ్లీలోనే గట్టి సమాధానం ఇస్తానని మంత్రి అన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!