

నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడివైపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పల్నాడు వాటర్‌గ్రిడ్ పనులను అడ్డుకునే విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్నామని, అలాంటప్పుడు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలా రాజీపడతామని ప్రశ్నించారు. గురువారం నల్లగొండ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన పల్నాడు వాటర్‌గ్రిడ్ అంశంపై మాట్లాడారు. ఇరిగేషన్ అధికారులు సకాలంలో ప్రభుత్వానికి సమాచారం అందించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన అధికారి సమాచార లోపం కారణంగా ఈ విషయం ప్రభుత్వం దృష్టికి ఆలస్యంగా వచ్చిందని పేర్కొన్నారు.
నాగార్జునసాగర్ ఎస్ఈ మల్లికార్జున్‌కు వాటర్‌గ్రిడ్ పనుల గురించి ముందుగానే తెలిసినా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదని మంత్రి ఆరోపించారు. ఈ విషయం తెలిసిన తర్వాత తాను ఎస్ఈకి ఫోన్ చేసి రాజీనామా చేసి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు వెల్లడించారు. ప్రభుత్వంలో ఉన్నవారే సమాచారం దాచిపెట్టి మోసం చేశారని ఆరోపిస్తూ, పల్నాడు వాటర్‌గ్రిడ్ పనులను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కూడా కలిసిరావాలని పిలుపునిచ్చారు. పనులు ఎప్పుడు ప్రారంభమయ్యాయనే దానికంటే వాటిని ఎలా అడ్డుకోవాలన్నదే ఇప్పుడు ముఖ్యమని అన్నారు. కేంద్ర జలజీవన్ మిషన్ కింద ఈ పనులు కొనసాగుతున్నందున కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఎగువ రాష్ట్రానికి నీటి వాటాలను తగ్గించి దిగువ ప్రాంతానికి నీటిని తరలించడం సరికాదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నాయకులు అనవసర విమర్శలు మానుకుని ఈ పనులను అడ్డుకునేందుకు సహకరించాలని సూచించారు. ప్రమాదం కారణంగా నిలిచిపోయిన ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!