

ములుగు జిల్లాలోని జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం (JCRDLIS) లిఫ్టింగ్ పాయింట్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సందర్శించి ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు మరియు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసే కీలక దశలో రాజకీయ ఆరోపణలు, అపోహలకు స్థానం లేదని సీఎం పేర్కొన్నారు.
సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్ర కాలంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, దేవాదుల సహా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గోదావరి జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడుకుంటామని స్పష్టం చేస్తూ, గతంలో ప్రాజెక్టులు సమయానికి పూర్తి అయితే రాష్ట్రానికి మరింత ప్రయోజనం కలిగేదని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగినా పనులను వేగవంతం చేసి రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
భూసేకరణ కోసం జూన్ 2లోపు రూ.600 కోట్లు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. దేవాదుల పంప్ హౌస్ మరమ్మతు పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల భూసేకరణకు ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి, భూములు కోల్పోయిన వారికి గ్రీన్ ఛానెల్ ద్వారా పరిహారం అందిస్తామని తెలిపారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల సమయంలో దేవాదుల పథకంపై ప్రత్యేక సమావేశం నిర్వహించి అన్ని అంచనాలకు ఆమోదం తీసుకుంటామని సీఎం వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!