

కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరిగిన వైద్య నిర్లక్ష్యం మరొక ప్రాణాన్ని బలి తీసుకుంది. తాళ్లరేవు మండలం గడిమొగ గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణి మల్లేశ్వరి చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తూ మరణించారు. ఇదే నెలలో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో 55 ఏళ్ల రోగి గడువు ముగిసిన మందులు ఇవ్వడంతో ప్రాణాలు కోల్పోయిన సంఘటన తర్వాత మరోసారి ప్రభుత్వ వైద్య సేవలపై ప్రశ్నలు తలెత్తాయి.
ఈ రెండు ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాధ్యులపై ఎటువంటి సడలింపు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గర్భిణికి పాంటాప్రోజోల్కు అలెర్జీ ఉందని, అలాగే హైపర్టెన్షన్ మరియు డయాబెటిస్ సమస్యలు ఉన్నాయని కేస్ షీట్లో స్పష్టంగా ఉండగా, వాటిని పట్టించుకోకుండా నవంబర్ 20 మధ్యాహ్నం పీజీ విద్యార్థిని పాంటాప్ ఇంజెక్షన్ ఇచ్చిన విషయం విచారణలో బయటపడింది.
ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే మల్లేశ్వరికి ఫిట్స్ రావడం, అనంతరం కార్డియాక్ అరెస్ట్ కారణంగా రాత్రి 10 గంటల సమయంలో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక నివేదిక పేర్కొంది. పర్యవేక్షణలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ వైఫల్యం కూడా ఈ విషాదానికి కారణంగా గుర్తించారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కాకినాడ జీజీహెచ్లో మృతి చెందిన గర్భిణీ కుటుంబానికి తగిన సహాయం అందించాలని అధికారులను సూచించారు. ఇలాంటి నిర్లక్ష్య సంఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!