

ఆంధ్రప్రదేశ్ మాజీ గృహ నిర్మాణ శాఖ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం లోని ఆయన నివాసంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈ ఉదయం సోదాలు నిర్వహించింది.
గత నెలలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేశ్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్ధన్ రావు, తాను జోగి రమేశ్ ఆదేశాల మేరకు నకిలీ మద్యం తయారు చేశానని వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ ఉదయం SIT అధికారులు రమేశ్ ఇంట్లో దాదాపు రెండు గంటలపాటు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయనను, వ్యక్తిగత సహాయకుడు అరెపల్లి రామును అదుపులోకి తీసుకున్నారు. వీరిని త్వరలోనే మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు.
గత నెలలో ములకలచెరువు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో భారీ స్థాయిలో నకిలీ మద్యం నిల్వలు బయటపడటంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
జనార్ధన్ రావు తన వద్ద ఉన్న స్క్రీన్షాట్లు, సంభాషణల ఆధారాలు SIT కు అందజేసినట్లు సమాచారం. ఈ ఆధారాలతో రమేశ్‌పై అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే రమేశ్ మాత్రం ఆరోపణలను ఖండిస్తూ, తాను లై డిటెక్టర్ టెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
ఇంతలో SIT వద్ద జోగి రమేశ్ ప్రమేయాన్ని నిర్ధారించే ముఖ్యమైన ఆధారాలు లభించాయని సమాచారం. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరో పెద్ద సంచలనంగా మారింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!