

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఆ వ్యాఖ్యలు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అన్నారు. విద్యా వ్యవస్థపై కనీస చిత్తశుద్ధి లేని వ్యక్తి విద్యాశాఖను నిర్వహించడం సరైంది కాదని విమర్శిస్తూ, విద్యాశాఖ బాధ్యతలను మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగించాలని సూచించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉందని, బ్లాక్‌బోర్డులు, చాక్ పీసులు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు కూడా లేవని అరవింద్ ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం ఇప్పటివరకు ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా సందర్శించారా అని ప్రశ్నించారు. ఎవరి సహాయం లేకుండా సీఎం తన నామినేషన్ పత్రాలను సొంతంగా నింపగలరా అని సవాల్ విసురుతూ, విద్యా రంగ సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!