

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) 19 రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఎన్నికల ఏర్పాట్లు, నామినేషన్ల ప్రక్రియ, భద్రతా చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. నామినేషన్ల సమయంలో అభ్యర్థులకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూ సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరగకుండా చూడాలని రాజకీయ పార్టీలు సూచించాయి. ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ, వినియోగాన్ని నియంత్రించేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని కోరాయి. పార్టీల నుంచి అందిన సూచనల ఆధారంగా జిల్లాల అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని ఎస్ఈసీ కమిషనర్ అనిల్ చంద్ర పూనేత్ తెలిపారు.
నామినేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తామని కమిషనర్ వెల్లడించారు. ఎన్నికల సమయంలో సున్నిత ప్రాంతాల్లో తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను చట్ట ప్రకారమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు లేవనెత్తిన సమస్యలను పరిశీలించి, ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ పేర్కొంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!