

నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల ద్వారా అన్ని వర్గాలకు రాజకీయంగా సమన్యాయం జరుగుతుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. డీలిమిటేషన్ వల్ల ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన నివాళుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు మహిళా విద్య, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని గుర్తుచేశారు. వారి ఆశయాలకు అనుగుణంగా మహిళలకు విద్యతో పాటు రాజకీయ అధికారం కూడా దక్కాలని అన్నారు. ఈ లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ అంశంపై మరింత ముందడుగు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
డీలిమిటేషన్ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం ‘ఒక వ్యక్తి – ఒక ఓటు – ఒక విలువ’ అనే సూత్రం ఆధారంగా జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరగాలని రాంచందర్ రావు అన్నారు. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు నష్టం కలగకుండా ప్రస్తుత సీట్ల సంఖ్యను దామాషా ప్రకారం 50 శాతం వరకు పెంచే ఆలోచనతో కేంద్రం ముందుకెళ్తోందని వివరించారు. ఈ ప్రతిపాదన అమలైతే తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 170కి పైగా పెరిగే అవకాశం ఉందని, పార్లమెంట్ స్థానాలు ప్రస్తుతం ఉన్న 17 నుంచి సుమారు 25 వరకు చేరవచ్చని తెలిపారు. 1971లో దేశ జనాభా సుమారు 56 కోట్లుగా ఉన్న సమయంలో లోక్‌సభలో 543 స్థానాలు ఉండేవని గుర్తుచేశారు. ప్రస్తుతం దేశ జనాభా 140 నుంచి 145 కోట్లకు చేరిన నేపథ్యంలో చట్టసభల్లో ప్రజల ప్రాతినిధ్యం కూడా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. 2021 జనగణన జరగనందున 2011 జనాభా లెక్కల ఆధారంగా సీట్ల పెంపు చేపట్టాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ మార్పుల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో పాటు మహిళలకు కూడా చట్టసభల్లో మరింత ప్రాతినిధ్యం లభిస్తుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం వివిధ నియోజకవర్గాల మధ్య ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని రాంచందర్ రావు తెలిపారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో సుమారు 40 లక్షల మంది ఓటర్లు ఉండగా, సికింద్రాబాద్‌లో 11 లక్షల మంది మాత్రమే ఉన్నారని ఉదాహరణగా చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే శేరిలింగంపల్లిలో సుమారు 7.5 లక్షల మంది ఓటర్లు ఉండగా, అంబర్‌పేటలో 2.5 లక్షల మంది ఉన్నారని వివరించారు. ఈ వ్యత్యాసాలను సరిచేసి అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడమే డీలిమిటేషన్ ప్రధాన ఉద్దేశమని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. రాజీవ్ గాంధీ హయాంలో మహిళా రిజర్వేషన్లపై చర్చ జరిగినప్పటికీ అది అమలుకు నోచుకోలేదని, యూపీఏ ప్రభుత్వ సమయంలో మిత్రపక్షాలే బిల్లును అడ్డుకున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నట్లు చెబుతూనే, డీలిమిటేషన్, రిజర్వేషన్ బిల్లులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రాజకీయ న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలు, మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించే కేంద్రం ప్రతిపాదనలకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!