

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజనపై ఉమ్మడి వైఖరిని ఖరారు చేసేందుకు ఇండియా కూటమి నేతలు నిర్వహించిన సమావేశం ముగిసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఈ భేటీకి 12 పార్టీల నాయకులతో పాటు స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ హాజరైనట్లు సమాచారం. పార్లమెంట్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచుతూ కేంద్రం తీసుకురానున్న ప్రతిపాదనలపై కూటమి నేతలు చర్చించారు. ఈ సందర్భంగా డీలిమిటేషన్‌కు సంబంధించి మూడు ప్రధాన డిమాండ్లను ముందుకు తెచ్చారు. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలని, సీట్ల సంఖ్యను పెంచకూడదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లను కూడా లోక్‌సభ ప్రస్తుత స్థానాల పరిధిలోనే అమలు చేయాలని కోరారు. పార్లమెంట్ సీట్ల పెంపుతో ముడిపెట్టకుండా ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనే మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రాల వారీగా లోక్‌సభ స్థానాల కేటాయింపులో ప్రస్తుతం ఉన్న వాటాను మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలని ఇండియా కూటమి కోరింది. నియోజకవర్గాల పునర్విభజన తాజా జనాభా లెక్కల ఆధారంగా జరగాలని కూడా డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లుపై విమర్శలు గుప్పించారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల ప్రయోజనాలను ఈ బిల్లు విస్మరించిందని ఆయన ఆరోపించారు. నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ఇండియా కూటమి ఈ డిమాండ్లను ముందుకు తీసుకురావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రం ప్రతిపాదించిన బిల్లుపై పార్లమెంట్‌లో తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!