

అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో ముందుకు సాగుతోందని మండిపడ్డారు.
అమరావతి నిర్మాణం పేరుతో భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందని జగన్ ఆరోపించారు. తాము రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ అభివృద్ధి ప్రణాళికను ప్రతిపాదించామని తెలిపారు. గతంలో తక్కువ వ్యయంతో ప్రభుత్వ భవనాలు నిర్మించినప్పటికీ, ప్రస్తుతం వేల కోట్ల రూపాయల ఖర్చులతో భారీ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. భవనాల రూపకల్పనలకే వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
‘సూపర్ సిక్స్’ హామీలు పూర్తిగా అమలు కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జగన్ అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు, మహిళలకు సంక్షేమ పథకాలు, నిరుద్యోగులకు భృతి అందడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల విక్రయాలు పెరిగిపోయాయని, సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలకే తమ పార్టీ కట్టుబడి ఉందని జగన్ స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!