

ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కరణలకు నైతిక విలువలు తోడైతే ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ దేశంలోనే నంబర్-1గా నిలిచే అవకాశం ఉందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారతీయం’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులు చేరినట్లు లోకేశ్ తెలిపారు. ఇంటర్‌లోనూ అడ్మిషన్లు పెరిగాయని పేర్కొంటూ, ఈ ఫలితాలకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారం కీలకమన్నారు.
చిన్న వయసు నుంచే పిల్లలకు చదువు, క్రీడలతో పాటు నైతిక విలువలను కూడా బోధించాలని లోకేశ్ అన్నారు. పెద్దలను, మహిళలను గౌరవించడం, గెలుపు-ఓటములను సమానంగా స్వీకరించడం వంటి విలువలను విద్యార్థుల్లో పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. చాగంటి కోటేశ్వరరావు మార్గదర్శకత్వంలో రూపొందించిన నైతిక విలువల పాఠ్యాంశాలను ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో మార్పు తరగతి గది నుంచే ప్రారంభమవుతుందని, విద్యాశాఖలో ప్రతి నిర్ణయం విద్యార్థి కేంద్రంగా ఉండాలని లోకేశ్ పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!