

భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైన నేపథ్యంలో, అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్‌పై 25 శాతం సుంకాలు విధించామని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ చర్యల మధ్యలోనే యూరోపియన్ యూనియన్ భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం ఆసక్తికరంగా మారిందన్నారు.
రష్యా చమురు ముందుగా భారత్‌కు చేరుతుందని, అక్కడ శుద్ధి చేసిన తర్వాత తయారైన చమురు ఉత్పత్తులు యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయని బెసెంట్ వివరించారు. ఈ విధంగా ఐరోపా దేశాలే పరోక్షంగా రష్యాకు నిధులు సమకూరుస్తున్నట్లవుతుందని వ్యాఖ్యానించారు.
అలాగే, డోనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ట్రంప్ చురుకుగా కృషి చేస్తున్నారని, ఈ యుద్ధం విషయంలో యూరోపియన్ దేశాల కంటే అమెరికానే ఎక్కువ త్యాగాలు చేసిందని తెలిపారు. అయితే ఆ త్యాగాల వివరాలను వెల్లడించలేదు.
ఇదిలా ఉండగా, భారత్ పై అమెరికా విధించిన సుంకాలు భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందని బెసెంట్ ఇటీవల సూచనప్రాయంగా చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ గణనీయంగా తగ్గించిందని, ఇది ఒక పెద్ద విజయం అని వ్యాఖ్యానించారు. చమురు విషయంలో ప్రస్తుతం సుంకాలు అమల్లో ఉన్నప్పటికీ, వాటిని తొలగించే మార్గం ఉందన్న సంకేతాలను కూడా ఇచ్చారు.
ఇక భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు విజయవంతంగా ముగిసినట్లు వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ తెలిపారు. ఈ ఒప్పందం ఇరువైపులా వాణిజ్యాన్ని మరింత విస్తరించేందుకు, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి దోహదపడుతుందని చెప్పారు. భారత కోణంలో ఈ ఒప్పందం సమతుల్యంగా, దూరదృష్టితో రూపొందించబడిందని ఆయన స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!