

రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. దీంతో ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి ఇప్పుడే చర్చించడం కొంత తొందరపాటే అయినప్పటికీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని క్లిప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఓటీటీలోకి వచ్చినప్పుడు థియేటర్లలో చూసిన వెర్షన్‌కు భిన్నంగా మరో వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైరల్ అవుతున్న ఓ క్లిప్ అంతర్జాతీయ ఇంగ్లిష్ వెర్షన్‌కు చెందినదిగా తెలుస్తోంది. అందులో గాయపడిన లక్ష్మణుడు, సీతాదేవితో కలిసి అసురుల నుంచి తప్పించుకునే సన్నివేశం కనిపిస్తోంది. తోడేళ్లను పోలిన జీవులు వారిని వెంబడించి దాడి చేయబోతున్న సమయంలో రాముడు వచ్చి వారిని రక్షిస్తాడు.
ఈ సన్నివేశం అంతర్జాతీయ వెర్షన్‌లో ఉన్నప్పటికీ, భారతీయ థియేట్రికల్ వెర్షన్‌లో కనిపించలేదని సమాచారం. దీంతో ఓటీటీలో జియోహాట్‌స్టార్ రెండు వెర్షన్లను అందిస్తుందా, లేక పలు భాషల ఎంపికతో ఒకే వెర్షన్‌ను విడుదల చేస్తుందా అనే ఆసక్తి నెలకొంది. సాయి పల్లవి, రవి దూబే, యష్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా, యష్ నిర్మించారు. హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. బాక్సాఫీస్ వద్ద సినిమా విజయవంతమైన ప్రదర్శన కొనసాగుతుందని అంచనా వేస్తున్న తరుణంలో, ఓటీటీలో రెండు వెర్షన్లు అందుబాటులోకి వస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!