

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ అధికారులు నిన్న హైదరాబాద్ నాంపల్లిలోని ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ1గా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఏ5గా యూకేకు చెందిన ఫార్ములా-ఈ ఆపరేషన్స్ సంస్థను పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ.55 కోట్లను విదేశీ సంస్థలకు మళ్లించినట్లు అభియోగపత్రంలో పేర్కొన్నారు. అలాగే ఏస్ నెక్స్ట్‌జెన్ సంస్థకు బాధ్యతలు అప్పగించడం, దానికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ.45 కోట్లు రావడం క్విడ్ ప్రోకోలో భాగమని ఆరోపించారు.
ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ను 2024 డిసెంబర్ 18న నమోదు చేయగా, తరువాత ఈడీ కూడా మరో కేసు నమోదు చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా కేటీఆర్, అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను అధికారులు పలుమార్లు విచారించారు. ఛార్జిషీట్లో నిధుల దుర్వినియోగం, మోసం, నేరపూరిత కుట్ర వంటి ఆరోపణలు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా, కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి, అర్వింద్ కుమార్‌పై చర్యలకు సంబంధించి డీవోపీటీ అనుమతి పొందడం వంటి ప్రక్రియల కారణంగా కేసు దర్యాప్తు కొంతకాలం సాగింది.
ఫార్ములా ఈ-కార్ రేసు నిర్వహణకు సంబంధించి 2022 అక్టోబర్ 25న ఎఫ్ఈవో, ఏస్ నెక్స్ట్‌జెన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరిలో హుస్సేన్‌సాగర్ వద్ద సీజన్-9 రేసు నిర్వహించారు. అనంతరం వివాదాలు తలెత్తడంతో 2023 అక్టోబరులో కొత్త ఒప్పందం కుదిరి, మొత్తం రూ.160 కోట్ల వ్యయం నిర్ణయించారు. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ నిధుల నుంచి రూ.45.71 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో బదిలీ చేయడం ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధమని గుర్తించి ఐటీ శాఖ జరిమానా విధించింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. విదేశీ సంస్థల ప్రతినిధులను ఆన్లైన్ ద్వారా విచారిస్తూ, అనేక దశల అనంతరం ఛార్జిషీట్ దాఖలు చేయడంతో దర్యాప్తు పూర్తయింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!