

తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమను ప్రాధాన్యత రంగంగా గుర్తించి, ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రత్యేక విధానాలను రూపొందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో–2026 ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజుకు 5.30 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతోందని, విద్యార్థులు, యువతకు పౌష్టికాహారం అందించడంలో పౌల్ట్రీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో పౌల్ట్రీ ఫారాల నిర్మాణానికి సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చేలా నిబంధనల్లో మార్పులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమకు అవసరమైన మొక్కజొన్న కొరత సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత మంత్రులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు.
రైతులు, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పౌల్ట్రీ పరిశ్రమ దోహదపడుతోందని సీఎం అన్నారు. పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా విధానాలను మెరుగుపరుస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయాలపై పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు రూపొందించిన మంచి విధానాలను కొనసాగిస్తూనే కొత్త పాలసీలను తీసుకొస్తామని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నప్పటికీ రాష్ట్రంలో రెండేళ్లకు సరిపడా సన్నబియ్యం నిల్వలు ఉన్నాయని తెలిపారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!