

2020లో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించిన కుట్ర కేసులో సామాజిక కార్యకర్తలు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద నమోదైన ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు గతంలో బెయిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ వీరిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలీలతో కూడిన ధర్మాసనం పిటిషన్లను విచారించింది. ఢిల్లీ పోలీసుల స్పందన కోరుతూ నోటీసులు జారీ చేసిన కోర్టు, వారి వాదనలు విన్న తర్వాతే మధ్యంతర బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
విచారణ సందర్భంగా ఉమర్ ఖలీద్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, షర్జీల్ ఇమామ్ తరఫున న్యాయవాది సిద్ధార్థ్ దవే మధ్యంతర బెయిల్ కోరారు. రక్షిత సాక్షుల విచారణలో జాప్యం జరుగుతోందని, సుదీర్ఘకాలంగా జైలులో ఉన్నామని వారు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. ఛార్జ్‌షీట్‌లో 47 మంది రక్షిత సాక్షులతో సహా 900 మందికి పైగా సాక్షులను ప్రాసిక్యూషన్ పేర్కొన్నప్పటికీ, ఇప్పటివరకు ఒక్కరిని కూడా విచారించలేదని షర్జీల్ ఇమామ్ తన పిటిషన్‌లో తెలిపారు. విచారణలో జాప్యం కారణంగా తన నిర్బంధం కొనసాగడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన హక్కులపై ప్రభావం చూపుతోందని ఉమర్ ఖలీద్ వాదించారు. ఈ కేసును ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందుకు తీసుకెళ్లే అంశాన్ని పరిపాలనాపరమైన అనుమతి కోసం ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ అల్లర్ల వెనుక పెద్ద కుట్ర ఉందన్న ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. నిందితులపై వచ్చిన ఆరోపణలు ఇంకా న్యాయస్థానంలో విచారణలో ఉన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!