

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’కు భారత అధికారిక ఆస్కార్ ఎంట్రీగా ఎంపికయ్యే ప్రక్రియలో 14 మంది సభ్యుల జ్యూరీలో కేవలం నాలుగు ఓట్లు మాత్రమే వచ్చాయని జ్యూరీ సభ్యుడు వివేక్ వాస్వానీ వెల్లడించారు. ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కొంతమంది జ్యూరీ సభ్యులకు సినిమా నచ్చినప్పటికీ, ఆస్కార్ కోసం ఎంపిక చేయడానికి అవసరమైన స్థాయిలో ఉందని భావించలేదన్నారు. భారత అధికారిక ఎంట్రీగా ఎంపిక చేసే సమయంలో జ్యూరీ ఆశించిన రీతిలో భారతీయ సంస్కృతి, గుర్తింపును ‘ధురంధర్’ ప్రతిబింబించలేదని వివరించారు.
మరోవైపు, ‘ధురంధర్’ భారీ బాక్సాఫీస్ విజయాన్ని అందుకోవడంతో ఈ నిర్ణయంపై సినీ అభిమానుల్లో చర్చ మొదలైంది. అయితే భారత అధికారిక ఆస్కార్ ఎంట్రీ ఎంపికలో సినిమా వాణిజ్య విజయం కంటే జ్యూరీ నిర్దేశించిన ప్రమాణాలే పరిగణనలోకి తీసుకున్నట్లు వివేక్ వాస్వానీ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. 33 చిత్రాలను పరిశీలించిన జ్యూరీ చివరకు ‘గొంధల్’, ‘అంగ్’, ‘మైనే వాపస్ ఆవూంగా’ చిత్రాలను తుది జాబితాలో ఉంచగా, మరాఠీ చిత్రం ‘గొంధల్’ను 2027 ఆస్కార్ అవార్డులకు భారత అధికారిక ఎంట్రీగా ఎంపిక చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!