

కృత్రిమ మేధ (ఏఐ)పై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2030 నాటికి ఏఐ కారణంగా మానవాళి అంతమవుతుందన్న వాదనల్లో ఎలాంటి అర్థం లేదని ఆయన కొట్టిపారేశారు. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, ప్రమాదాలపై వస్తున్న హెచ్చరికల కారణంగా కంపెనీలు ఏఐ అభివృద్ధిని నెమ్మదించకూడదని సూచించారు. అయితే తమ ఏఐ వ్యవస్థల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, అసురక్షితంగా భావించే సిస్టమ్‌లను విడుదల చేయకూడదని స్పష్టం చేశారు.
మరోవైపు, రానున్న పదేళ్లలో ఏఐ కారణంగా 10 శాతానికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆంథ్రోపిక్ పరిశోధకుడు ఇవాన్ హుబింగర్ ఇటీవల పేర్కొన్నారు. ఏఐ అభివృద్ధి వేగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్, ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్, ఎక్స్‌ఏఐ అధిపతి ఎలాన్ మస్క్ అభిప్రాయపడిన సందర్భంలో.. జెన్సన్ హువాంగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!