

తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. మంగళవారం సాయంత్రం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహించిన ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు అభిమానులు భారీగా హాజరయ్యారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సహజమైన హాస్యం, కుటుంబ అనుబంధాలు, సున్నితమైన భావోద్వేగాలతో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ వేడుకలో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల అభిమానులు 28 ఏళ్లుగా తనపై చూపిస్తున్న ప్రేమకు సూర్య కృతజ్ఞతలు తెలిపారు. నాగవంశీ, వెంకీ అట్లూరి కలయికలోనే ఇలాంటి మంచి సినిమా సాధ్యమైందని అన్నారు. ‘గజినీ’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు అందించిన ఆదరణను గుర్తుచేసుకుంటూ.. ‘విశ్వనాథ్ & సన్స్’ కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల ప్రేమను పొందాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో సినిమా కోసం గడిపిన ఆరు నెలలు తనకు ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తుండిపోతాయని చెప్పారు.
వేడుకకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖకు వెంకీ అట్లూరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, థియేటర్లలో ప్రేక్షకులకు కూడా అదే అనుభూతి కలుగుతుందని అన్నారు. ఇది కేవలం సూర్య అభిమానుల కోసం మాత్రమే కాకుండా వారి కుటుంబాల కోసం రూపొందించిన చిత్రమని చెప్పారు. సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకుల ముఖాలపై చిరునవ్వు ఉంటుందని, సూర్య గొప్ప నటుడే కాకుండా గొప్ప మనసున్న వ్యక్తి అని ప్రశంసించారు.
సూర్య నటించిన ‘గజినీ’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని నాగవంశీ అన్నారు. ఆ చిత్రాల సరసన ‘విశ్వనాథ్ & సన్స్’ కూడా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తల్లీకొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో సినిమా సాగుతుందని, అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుందని చెప్పారు. థియేటర్ నుంచి ప్రేక్షకులు మంచి సినిమా చూశామనే సంతృప్తితో బయటకు వస్తారని అన్నారు.
తనకు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరికి మమితా బైజు కృతజ్ఞతలు తెలిపారు. సూర్యతో కలిసి నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. భవిష్యత్తులో ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాధికా శరత్‌కుమార్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెబుతూ.. ఆగస్టు 14న విడుదలయ్యే ‘విశ్వనాథ్ & సన్స్’ను కుటుంబంతో కలిసి ప్రేక్షకులు ఆస్వాదించాలని కోరారు.
చాలా సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో ఇలాంటి వేడుకకు హాజరవుతున్నానని రాధికా శరత్‌కుమార్ తెలిపారు. ‘విశ్వనాథ్ & సన్స్’ తనకు ఎంతో ప్రత్యేకమైన సినిమా అని చెప్పారు. అందరూ దీనిని ఫ్యామిలీ సినిమా అంటున్నప్పటికీ.. తన దృష్టిలో ఇది ప్రేమ, బంధాల గురించి చెప్పే కథ అని వివరించారు. వెంకీ అట్లూరి రచనను, నాగవంశీ నిర్మాణాన్ని, సూర్య నటనను ప్రశంసించిన ఆమె.. మమితా బైజుకు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు.
మొదటి నుంచే ‘విశ్వనాథ్ & సన్స్’లో విజయ లక్షణాలు కనిపించాయని రామజోగయ్య శాస్త్రి అన్నారు. తెలుగు ప్రేక్షకుల్లో సూర్యకు ఉన్న ప్రత్యేకమైన క్రేజ్‌ను ఆయన ప్రస్తావించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత సారథ్యంలో ఈ చిత్రానికి మూడు పాటలు రాశానని తెలిపారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చిందని, వెంకీ అట్లూరి కథ, రచనా శైలిని ప్రశంసిస్తూ.. కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!