

శర్వానంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘భోగి’ విడుదల వాయిదా పడింది. ఈ రస్టిక్ యాక్షన్ డ్రామాను నవంబర్ 13న థియేటర్లలోకి తీసుకురావాలని చిత్రబృందం తొలుత భావించింది. అయితే, అనివార్య కారణాల వల్ల అనుకున్న తేదీకి సినిమాను విడుదల చేయడం లేదని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ‘భోగి’ తమకు ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, అంకితభావంతో రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అనుకోని జాప్యాల కారణంగా సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వచ్చిందని వెల్లడించారు. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని, సినిమా రిలీజ్‌పై వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని, వాటిని ప్రచారం చేయవద్దని అభిమానులను కోరారు.
ఈ అదనపు నిరీక్షణకు తగిన ఫలితం అందిస్తామని చిత్రబృందం హామీ ఇచ్చింది. ఇదిలా ఉండగా, సెన్సార్ సంబంధిత సమస్యలే సినిమా వాయిదాకు కారణమై ఉండవచ్చని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. శర్వానంద్‌ను ఈ రస్టిక్ యాక్షన్ డ్రామాలో చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు విడుదల వాయిదా నిరాశ కలిగించింది. ఇప్పుడు కొత్త విడుదల తేదీ ప్రకటన కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!