

విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యే వరకు కొత్త ప్రాజెక్టులు తీసుకోరని అనుకున్నప్పటికీ, తాజాగా ఆయన ప్రణాళికల్లో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాత సురేశ్ బాబు తెలిపిన సమాచారం ప్రకారం, ‘దృశ్యం 3’ తెలుగు రీమేక్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు టీమ్ సిద్ధమవుతోంది.
మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో రూపొందిన మలయాళ ‘దృశ్యం 3’ షూటింగ్‌ను దర్శకుడు జీతూ జోసఫ్ ఇప్పటికే పూర్తి చేశారు. ఈ చిత్రం ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదల కానుంది. ఆ తరువాత వెంటనే వెంకటేశ్‌తో తెలుగు వెర్షన్‌ను తెరకెక్కించనున్నారు. గతంలో ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలు ఘన విజయాలు సాధించడంతో, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేసి అక్టోబర్‌లో విడుదల చేయాలని యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా, దర్శకుడు అనిల్ రావిపూడితో మరో సినిమా కూడా ప్లాన్‌లో ఉన్నప్పటికీ, అది ఈ ఏడాది ప్రారంభం కాదని సమాచారం. ప్రస్తుతం ఈ ఏడాదిలోనే ‘ఆదర్శ కుటుంబం’తో పాటు ‘దృశ్యం 3’ను పూర్తి చేయడమే వెంకటేశ్ లక్ష్యంగా పెట్టుకున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!