

బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రం విడుదలకు ముందే న్యాయపరమైన వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పూజా ఎంటర్టైన్మెంట్, దర్శకుడు డేవిడ్ ధావన్‌పై రూ.400 కోట్ల నష్టపరిహారం దావా వేసింది. తమ క్లాసిక్ హిట్ చిత్రం ‘బివి నెం.1’లోని ఐకానిక్ పాటలను తగిన అనుమతులు లేకుండా ఈ సినిమాలో వినియోగించారని సంస్థ ఆరోపించింది.
ఈ అంశంపై విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో పూజా ఎంటర్టైన్మెంట్, సినిమా ప్రమోషన్స్, విడుదల, స్ట్రీమింగ్పై తక్షణ స్టే విధించాలని కోరింది. అలాగే వివాదాస్పద పాటలను తొలగించడంతో పాటు ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ టైటిల్‌ను కూడా మార్చాలని డిమాండ్ చేసింది. ఒకవేళ ఈ డిమాండ్లను పట్టించుకోకుండా పాటలను వినియోగిస్తే అదనంగా మరో రూ.100 కోట్ల నష్టపరిహారం కోరనున్నట్లు హెచ్చరించింది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ ధావన్ హీరోగా నటించగా, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!