

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఇటీవల పలు భారీ చిత్రాలు వాయిదా పడటంతో పాటు రాజమౌళి సినిమాల నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుందనే ప్రచారం నేపథ్యంలో ‘వారణాసి’ కూడా వాయిదా పడుతుందనే వార్తలు వినిపించాయి.
ఈ ప్రచారానికి తెరదించుతూ ప్రముఖ రచయిత, ‘వారణాసి’ కథకుడు విజయేంద్ర ప్రసాద్ విడుదల తేదీపై మరోసారి స్పష్టత ఇచ్చారు. తాజాగా ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన.. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఏప్రిల్ 7, 2027న ‘వారణాసి’ ప్రేక్షకుల ముందుకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుందని, నవంబర్‌లో చిత్రీకరణ పూర్తి చేసి వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!