

రాజమౌళి కుటుంబం అంతా ప్రతిభావంతులనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథా రచయితగా గొప్ప పేరు సంపాదించగా, సోదరుడు కీరవాణి సంగీత ప్రపంచంలో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. రాజమౌళి సతీమణి రమ ప్రముఖ స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందారు. మరో సోదరుడు కళ్యాణి మాలిక్ కూడా సంగీత దర్శకుడిగా మంచి పేరును తెచ్చుకున్నారు.
కానీ రాజమౌళి మరో సోదరుడు ఎస్.ఎస్. కాంచి ప్రతిభకు మాత్రం కావాల్సినంత గుర్తింపు రాలేదు. ‘అమృతం’ సీరియల్ ద్వారా మంచి ఖ్యాతి తెచ్చుకున్న కాంచి, కొన్ని సినిమాల్లో నటించారు. ఇటీవల ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో ఆయనకు మంచి బ్రేక్ లభించింది. కానీ కాంచి కేవలం నటుడే కాదు-అతను రచయిత, దర్శకుడు కూడా. ‘మర్యాద రామన్న’ కథకి సహకరించడంతో పాటు మరికొన్ని రాజమౌళి సినిమాలకు కూడా రచనా సహాయం అందించాడు.
అలాగే ‘షో టైం’ అనే సినిమాను కూడా డైరెక్ట్ చేశారు, అయితే ఆ చిత్రం విడుదల కాలేదు. ఆ తరువాత ఆయన దర్శకత్వ ప్రయత్నాలు చేయలేదు.
ఇప్పుడు కాంచి ఒక భారీ, సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు రచయితగా పని చేయడం ప్రత్యేకం-అది ‘వారణాసి’, మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా. సాధారణంగా రాజమౌళి చిత్రాలకు కథకుడిగా విజయేంద్ర ప్రసాద్ పేరే ముందుంటుంది. ఇతరుల సహకారం ఉన్నా, ప్రధాన కృషి ఆయనదే.
కానీ ఈసారి విజయేంద్ర ప్రసాద్‌తో పాటు ఎస్.ఎస్. కాంచి కూడా కథా రచయితగా చేరారు. రీసెంట్గా వచ్చిన వీడియో గ్లింప్స్‌లో కూడా ఇద్దరి పేర్లు కలిసి కనిపించాయి. కాంచికి పురాణాలపై ఉన్న పట్టు, కథ నిర్మాణంలో పెద్ద పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
స్థాయి ఉన్నప్పటికీ అందుకు తగ్గ గుర్తింపు రాని కాంచికి, ఈ ‘వారణాసి’ సినిమా పెద్ద బ్రేక్ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!