

‘మెయిల్’, ‘రైటర్ పద్మభూషణ్’, ‘మ్యాడ్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీ గౌరి ప్రియకు ‘చెన్నై లవ్ స్టోరీ’ కెరీర్‌లో మరో కీలక మలుపుగా నిలిచింది. కిరణ్ అబ్బవరం సరసన ఆమె నటించిన ఈ క్లీన్ లవ్ స్టోరీకి థియేటర్లలో మంచి స్పందన లభించడంతో పాటు రిపీట్ ఆడియెన్స్ కూడా వచ్చారు. తాజాగా ఆగస్టు 21 నుంచి ఈ సినిమా సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీ గౌరి ప్రియ తన కెరీర్ ప్రయాణంపై భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్‌లో పుట్టి పెరిగిన తాను చిన్నప్పటి నుంచి థియేటర్లలో సినిమాలు చూస్తూ, పాటలు వింటూ పెరిగానని చెప్పారు. అదే సినీ పరిశ్రమలో భాగం కావడం తన కల నిజమైనట్లుగా అనిపిస్తోందని తెలిపారు. ‘చెన్నై లవ్ స్టోరీ’కు నో చెప్పి ఉంటే తన కెరీర్ మరోలా ఉండేదని, ఈ అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
సినిమాలో నివి అనే సవాలుతో కూడిన పాత్రలో శ్రీ గౌరి ప్రియ నటించారు. ప్రేమలో విఫలమై మద్యానికి అలవాటు పడే పాత్రను పోషించడం సులభం కాదని ఆమె తెలిపారు. ముఖ్యంగా శ్మశానవాటికలో వచ్చే సన్నివేశం శారీరకంగా, భావోద్వేగపరంగా చాలా కష్టంగా అనిపించిందని చెప్పారు. అయితే సినిమా చూసిన తర్వాత నివి పాత్రలో తమను తాము చూసుకున్నామని ప్రేక్షకులు పంపిన సందేశాలు నటిగా తనకు ఎంతో సంతృప్తినిచ్చాయని తెలిపారు. థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను తప్పకుండా ఆస్వాదిస్తారని, ఈ స్ట్రీమింగ్ తనకు రెండో రిలీజ్ లాంటిదని శ్రీ గౌరి ప్రియ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!