

సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల బోటు ఆచూకీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. గాలింపు చర్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బోటును గుర్తించేందుకు మరింత విస్తృతంగా గాలింపు చేపట్టాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు నవంబర్ 4న మోటరైజ్డ్ ఫిషింగ్ బోటులో చేపల వేటకు వెళ్లారు. పారాదీప్ పోర్టు సమీపానికి చేరుకున్న తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. ఈ నెల 19 నుంచి బోటుతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. మత్స్యకారుల మొబైల్ ఫోన్లు, బోటులోని ట్రాన్స్‌పాండర్ స్విచ్ ఆఫ్ కావడంతో జీపీఎస్ ద్వారా కూడా వారి ఆచూకీని గుర్తించడం సాధ్యం కాలేదు.
ప్రస్తుతం కాకినాడ, చెన్నై, ఒడిశా కోస్ట్‌గార్డ్ అధికారులు సమన్వయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. భారత కోస్ట్‌గార్డ్‌కు చెందిన నౌకలు, హెలికాప్టర్లతో పారాదీప్ తీర ప్రాంతంలో విస్తృతంగా అన్వేషిస్తున్నారు. గాలింపు చర్యల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని చంద్రబాబు అధికారులకు సూచించారు. మత్స్యకారుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, గాలింపు పురోగతిని వారికి తెలియజేస్తూ అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!