

ఏఐ (AI) వంటి ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేసే కంటెంట్‌ను ప్రోత్సహించవద్దని ప్రతి సోషల్ మీడియా వినియోగదారుని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. టెక్నాలజీని బాధ్యతతో, సరైన దిశలో ఉపయోగించడం ఒక విషయం అయితే, అదే టెక్నాలజీని ఇతరులను గాయపరిచే విధంగా దుర్వినియోగం చేయడం మరో విషయం. అభివృద్ధి అనేది మన జీవితాలను సులభతరం చేయడానికి ఉండాలి; భయం, అవమానం లేదా మానసిక వేదనను సృష్టించడానికి కాదు.
ప్రతి మహిళ—ఆమె ఏ వృత్తిని ఎంచుకున్నా—ఎవరో ఒకరి కూతురు, మనుమరాలు, అక్కచెల్లి, స్నేహితురాలు లేదా సహచరురాలే. కళను తన జీవన మార్గంగా ఎంచుకున్నందుకే ఆమెను అవమానించడం లేదా దోపిడీ చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. గౌరవం అనేది ప్రతి మహిళకు సహజ హక్కు.
మేము భాగంగా ఉన్న ఈ పరిశ్రమ ప్రజలకు ఆనందాన్ని, ఆశను, సానుకూల భావాలను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. అలాంటి పరిశ్రమలో పనిచేసే మేము కూడా గౌరవప్రదమైన, సురక్షితమైన, భయంలేని వాతావరణంలో మా వృత్తిని కొనసాగించగలమనే నమ్మకం కలిగి ఉండటం ఎంతో అవసరం.
నా వృత్తి సంబంధిత బాధ్యతల కారణంగా ఆన్‌లైన్‌లో జరుగుతున్న కొన్ని పరిణామాల గురించి నాకు తొలుత అవగాహన లేదు. వాటిని నా దృష్టికి తీసుకొచ్చిన నా శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పటివరకు నేను ప్రతికూలతలను తేలికగా తీసుకుంటూ, నిశ్శబ్దంగా నా పనిపైనే దృష్టి పెట్టడానికే ప్రాధాన్యం ఇచ్చాను. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు మాత్రం నన్ను తీవ్రంగా కలిచివేసి, మానసికంగా ఎంతో బాధను కలిగిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న నా సహ నటీనటులను కూడా నేను గమనిస్తున్నాను. అందుకే ఈ విజ్ఞప్తి నా వ్యక్తిగత బాధ మాత్రమే కాదు; ఇలాంటి దుర్వినియోగానికి గురవుతున్న ప్రతి ఒక్కరి తరఫున నేను మాట్లాడుతున్నాను.
గౌరవంతో, ధైర్యంతో, నా ప్రేక్షకులపై నమ్మకంతో మీ మద్దతును కోరుతున్నాను. తప్పును తప్పుగా గుర్తించి, న్యాయానికి నిలబడే బాధ్యతాయుతమైన స్వరాలు ఈ సమయంలో అత్యంత అవసరం. ఈ విషయాన్ని ఇకపై సంబంధిత అధికారులే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.
— శ్రీలీల











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!