

ఇటీవల ‘మండాడి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ నటుడు సూరి, ఇప్పుడు ‘సంచారి’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సూరి, మలయాళ స్టార్ నివిన్ పౌలి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 1న తెలుగులో గ్రాండ్‌గా విడుదల కానుంది. ‘సప్తగిరులు సప్తసాగరాలు’ అనేది ఈ సినిమాకు ట్యాగ్‌లైన్. కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత ఎం. సుబ్బారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించగా, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, నటీనటుల అభినయం సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. జాతీయ అవార్డు గ్రహీత రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ‘తంగ మీన్కల్’, ‘తారమణి’, ‘పెరంబు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రామ్ ఈ సినిమాను తనదైన శైలిలో రూపొందించారు.
యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సూరి, నివిన్ పౌలి వంటి విలక్షణ నటులు, దర్శకుడు రామ్ శైలి, యువన్ శంకర్ రాజా సంగీతం కలయికతో ‘సంచారి’పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. వాస్తవానికి ఈ చిత్రం ‘ఏళు కడల్ ఏళు మలై’ పేరుతో తమిళంలో తెరకెక్కింది. ఇటీవల ‘మండాడి’ విజయంతో సూరికి తెలుగులో మంచి గుర్తింపు రావడంతో ఈ చిత్రాన్ని ‘సంచారి’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో తెలుగు నటుడు సుహాస్ కూడా కీలక పాత్రలో నటించారు. అక్టోబర్ 1న థియేటర్లలోకి రానున్న ‘సంచారి’ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!