

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణ, ఆమెకు సంబంధించిన కొన్ని సన్నివేశాలపై గతంలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమాలోని ప్రత్యేక పాట చుట్టూ వివాదం నెలకొనగా.. తాజాగా జాన్వీ కపూర్ సైతం తనను చూపించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ‘పెద్ది’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన శ్రుతిహాసన్ తాజాగా స్పందించింది. ప్రస్తుతం తన తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఆమె.. ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదంపై మాట్లాడింది. ఇతర నటీమణుల వ్యక్తిగత అనుభవాలు, వారు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి పూర్తిగా తెలియకుండా వ్యాఖ్యానించడం సరైన పద్ధతి కాదని శ్రుతి అభిప్రాయపడింది. అందుకే జాన్వీ కపూర్ తరఫున తాను మాట్లాడలేనని స్పష్టం చేసింది.
ఇదే సందర్భంగా ‘పెద్ది’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి గల కారణాన్ని కూడా శ్రుతిహాసన్ వివరించింది. గతంలోనూ తాను ఇలాంటి పాటల్లో నటించానని, డ్యాన్స్ చేయడం, అందంగా ముస్తాబవడం, గ్లామరస్‌గా కనిపించడం తనకు ఇష్టమని తెలిపింది. అయితే ఇతరులను మెప్పించాలనే ఉద్దేశంతో కాకుండా, తనకు నచ్చినప్పుడే ఇలాంటి పాటలు చేస్తానని పేర్కొంది. తనకు సౌకర్యంగా అనిపించని దుస్తులు ధరించడం లేదా ఇష్టం లేని పనులు చేయడం తనకు అలవాటు లేదని వెల్లడించింది. దీంతో జాన్వీ కపూర్ వ్యక్తిగత అనుభవాలపై ఎలాంటి తీర్పు ఇవ్వకుండా.. స్పెషల్ సాంగ్స్ విషయంలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించింది. ప్రస్తుతం శ్రుతిహాసన్ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో మరోసారి చర్చకు దారితీశాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!