

తేనె సేకరించి జీవనం సాగించే మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో 20 ఏళ్ల కారాగారశిక్ష అనుభవిస్తున్న నిందితుడికి శిక్ష తగ్గించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇలాంటి తీవ్రమైన నేరానికి పాల్పడిన వ్యక్తికి రెండు రోజుల శిక్ష తగ్గింపు కూడా ఇవ్వలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నల్లపోతుల అల్లాజీ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ వినోద్‌చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసు విచారణ సమయంలో జైలులో గడిపిన కాలాన్ని పరిగణనలోకి తీసుకొని శిక్షను తగ్గించాలని నిందితుడు కోరాడు.
నిందితుడి తరఫు న్యాయవాది వాదిస్తూ, ట్రయల్ కోర్టు ఐపీసీ సెక్షన్ 376-డి కింద యావజ్జీవ కారాగారశిక్ష విధించిందని, శిక్ష తగ్గింపునకు అవకాశం లేకుండా అలా విధించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జస్టిస్ వినోద్‌చంద్రన్.. హైకోర్టు ఇప్పటికే శిక్షను 20 ఏళ్లకు తగ్గించిందని గుర్తుచేశారు. విచారణ సమయంలో జైలులో గడిపిన కాలాన్ని మినహాయించి 20 ఏళ్ల శిక్ష విధించారని, దానిని మరింత తగ్గించాలని న్యాయవాది కోరగా.. ఇలాంటి నేరానికి పాల్పడిన వ్యక్తికి రెండు రోజుల శిక్ష తగ్గింపు కూడా అర్హత లేదని జస్టిస్ జేబీ పార్దివాలా వ్యాఖ్యానించారు. పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఈ ఘటన 2015లో జరగ్గా, 2017 జులై 19న మహబూబ్‌నగర్ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు నిందితులిద్దరికీ యావజ్జీవ కారాగారశిక్ష విధించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!