

మున్సిపల్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల యంత్రాంగం ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై దృష్టి సారించింది. గురువారం జరగనున్న పోలింగ్ కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన సామగ్రిని పంపిణీ చేశారు. మురసు తుపాను ప్రభావం నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు, స్థానిక పరిణామాలను నిరంతరం పర్యవేక్షించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లను ఆదేశించింది. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే క్షేత్రస్థాయి అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుని తగిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తెలిపారు. ఓటర్ల రద్దీని నియంత్రించడం, క్యూలైన్లను క్రమబద్ధీకరించడం, అవసరమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 31,460 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 2.81 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని ఎస్‌ఈసీ కార్యదర్శి మల్లికార్జున తెలిపారు. ఎన్నికల విధుల్లో 2.52 లక్షల మంది సిబ్బంది పాల్గొంటుండగా, కౌంటింగ్ కోసం 52 వేల మందిని నియమించనున్నారు. మొత్తం 9,821 ఎంపీటీసీ స్థానాల్లో 2,051, 659 జడ్పీటీసీ స్థానాల్లో 77 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 7,770 ఎంపీటీసీ, 582 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!